Suresh Geda
ఎక్కడ గుంటూరులోని తుమ్మలపాలెం.. ఎక్కడ అమెరికాలోని మేరీలాండ్..లోతుగా ఆలోచిస్తే జీవితం అనుకోని సంఘటనల సమ్మేళనమే కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఉన్న నాలుగు ఎకరాల్లో ఎండను వానను తట్టుకుని ఎకరాకు ఎన్ని బస్తాలు పండించాలి అని కలలు కనే కుటుంబ స్థాయి నుండి నేడు ఏసీలో కూర్చుని డాలర్లు సంపాదించే స్థితికి వచ్చానంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే వ్యవసాయం కన్నా డాలర్లు సంపాదించడం గొప్ప అని నేను ఇప్పుడు సైతం భావించడం లేదు. ఎంత సంపాదించినా పట్టెడన్నం నోట్లోకి పోవాలంటే రైతన్న చలవ ఉండాల్సిందే. కాబట్టి ఎవరి గొప్పతనం వారిదే. కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా తోటి మనుషులను గౌరవిస్తూ ముందుకు సాగటం ఆ నేపధ్యమే నాకు నేర్పింది.
చిన్నప్పుడు ఉన్న అర కొర సదుపాయాలతో బుద్ధిగా చదువుకుంటూ, ఈ చదివిన చదువుతో భవిష్యత్తులో నిలదొక్కుకోగలనో లేనో అనే అభద్రతా భావం నుండి కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు సాయపడగల శక్తి నాకు కలుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అయితే ఈ ప్రయాణంలో నాకు సహకరించిన వారెందరో ఉన్నారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, మంచికీ చెడుకీ తోడున్న సావాసగాళ్ళే కాక నేను ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టినప్పుడు "నేను ఇంకా పైకి ఎదగగలను" అని నాకు విశ్వాసం కల్పించిన నా విద్యార్ధులు.. ఇలా ఎందరో నా ఈ ప్రస్థానానికి మూల కారకులు.
ఒక మనిషి ఎదగాలంటే అతని ఒక్కడి వల్లే సాధ్యం కాదని, ఆ ప్రయాణంలో ఎందరో మెట్లుగా ఉండి దారి పరుస్తారని, వారిని ఎప్పుడూ విస్మరించరాదని నాకు ఈ జీవితం నేర్పిన పాఠం. ఆ పాఠం నేను పాటిస్తూ, చుట్టూ ఉన్న వారిని గౌరవిస్తూ ముందుకు సాగబట్టే ఈ రోజు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీలాండ్ (TAM) కి అధ్యక్షుడిగా ఎన్నికవడానికి కారణమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఐకమత్యమే మహాబలం అన్న నానుడి మనసా వాచా నమ్మే నేను మేరీలాండ్ లోని తెలుగు మిత్రులందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ తెలుగు సాంప్రదాయాలను, సంస్కృతినీ గౌరవించుకుంటూ.. తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా సభ్యులందరినీ చైతన్యపరుస్తూ ఏక తాటిపై నిలిపి సహాయం చేసే విధంగా అహర్నిశలూ పాటుపడటానికి సిధ్ధంగా ఉన్నాను.
ఇంతకు ముందు కొన్ని సంస్థలలో పని చేసినా మంచి స్నేహితులెందరినో ఇచ్చిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మేరీలాండ్ (TAM) కు పని చేయడం నాకు అమితానందాన్ని ఇస్తుంది. TAM వ్యవస్థాపక సభ్యుడిగా, కన్వీనర్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నో కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్న అనుభవం నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించే TAM నియమావళికి ఎటువంటి ఆటంకం కలగకుండా మరిన్ని మంచిపనులు చేస్తూ మరింత మందికి సాయపడగలిగే విధంగా ముందుకు సాగుతాను. కుల, మత, జాతి, వర్గ, లింగ భేదాలు మరియు భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ, నలుగురికీ మంచి చేసే దిశగా ఆలోచిస్తూ తెలుగు వారంతా ఒక్కటే అనే సదుద్దేశంతో వ్యవహరిస్తానని మాట ఇస్తున్నాను.
ఇట్లు..మీ..
శ్రీనివాస్ సామినేని
President - మేరీలాండ్ తెలుగు సంఘం